ష్ట్రంలో కరోనావ్యాప్తి నివారణకు చేస్తున్న కృషిని మరింత అంకితభావంతో కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రోగులకు వైద్యం అందిస్తున్న వైద్య ఆరోగ్య సిబ్బందికి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఏ ఒక్కరినీ వదులకుండా పరీక్షలు నిర్వహించి, వైద్యంచేస్తామని, వ్యాధి సోకినవారిని కలిసిన ప్రతి ఒక్కరినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రాష్టంలో లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ వరికోతలకు, ధాన్యం సేకరణకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, ధాన్యం సేకరణ అంశాలపై ఆదివారం రాత్రి 10 గంటలవరకు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే విషయంలో, వ్యాధి సోకినవారికి వైద్యం అందించే విషయంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది గొప్ప సేవలు అందిస్తున్నారు. వారి భద్రతకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. వారి ఆరోగ్య పరిరక్షణ విషయంలో ప్రత్యేకచర్యలు చేపట్టింది. ప్రస్తుతం పరీక్షలకు, వైద్యానికి వస్తున్నవారికి సరిపడినంతగా టెస్ట్ కిట్లు, పీపీఈలు, మాస్కులు, ఇతర మందులు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో పేషెంట్ల సంఖ్య పెరిగినా, అందుకు అనుగుణంగా మాస్కులు, పీపీఈలు సేకరిస్తాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.