ఒక్కదానికే..!

విరాట్‌ కోహ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే టెస్టు క్రికెట్‌లో తిరుగులేకుండా దూసుకెళ్తున్న టీమ్‌ఇండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లోనూ అదే జోరు కొనసాగిస్తూ వచ్చింది. న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ముందు వరకు డబ్ల్యూటీసీలో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లో జయకేతనం ఎగురవేసిన భారత్‌కు.. న్యూజిలాండ్‌ రూపంలో తొలి దెబ్బ ఎదురైంది. ‘ఒక్క ఓటమితో పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు’అని కెప్టెన్‌ కోహ్లీ అంటున్నా.. వరుసగా ఏడు టెస్టుల్లో ఎదురులేకుండా సాగిన టీమ్‌ఇండియా జైత్రయాత్రకు బ్రేక్‌ పడటం అభిమానులకు మింగుడుపడటం లేదు. రెండో మ్యాచ్‌లోనూ ఓడినా మేం పెద్దగా పట్టించుకోబోమని కోహ్లీ పేర్కొంటుంటే.. మరోవైపు నుంచి ఇప్పటికే విమర్శల వర్షం ప్రారంభమైంది. 


పరిమిత ఓవర్ల క్రికెట్‌లో దుమ్మురేపుతున్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టులకు ఎంపిక చేయకపోవడంపై క్రికెట్‌ దిగ్గజం కపిల్‌దేవ్‌ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఉపఖండంలోలాగా ఆడితే న్యూజిలాండ్‌ గడ్డపై టెస్టు నెగ్గడం అంత సులువు కాదు’అని కివీస్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రెయిగ్‌ మెక్‌మిలన్‌ అంటుంటే.. విరాట్‌ కోహ్లీ వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణం అని సంజయ్‌ మంజ్రేకర్‌ అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్‌ హగ్‌ మరో అడుగు ముందుకేసి ‘న్యూజిలాండ్‌ పర్యటనలో తొలి రెండు వారాలే టీమ్‌ఇండియా అసలు సిసలు క్రికెట్‌ ఆడింది. ఆ తర్వాత నాలుగు వారాలు వారికి కివీస్‌ టూర్‌ విహార యాత్రగా మారింది’అని విమర్శలు ఎక్కుపెట్టాడు. బయటి వారి మాటలను పెద్దగా పట్టించుకోమంటున్న కోహ్లీ.. నెట్స్‌లో చెమటోడ్చి రెండో టెస్టులో పుంజుకుంటాం అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మరి తొలి మ్యాచ్‌లో మనవాళ్ల పొరపాట్లేంటో ఓసారి పరిశీలిస్తే..